నేను ఈ మద్య తిరుమల వెళ్ళినప్పుడు, వెంకన్న స్వామివారి దర్శనం అయిన తర్వాత TTD museum కి వెళ్ళాను. అక్కడ ఉన్న చిత్రపటాలు చూస్తుండగా, తిరుమల లోని శిలాతోరణం యొక్క చిత్రపటం కంటపడింది. దాని మీద శిలాతోరణం యొక్క విశిష్టత గురించి వ్రాయబడి ఉంది. దాని ప్రకారం, శిలాతోరణం మీద పురాతత్వ శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోదనలు జరిపి, ఆ శిలలు వయసు సుమారు 250 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా వేశారు. ఆ శిలలు తోరణంగా ఏర్పడి 160 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగం లో మొట్ట మొదటి సారిగా ఈ భూమి మీద అడుగు పెట్టింది కూడా ఈ శిలాతోరణం వద్దనే అని ఒక కథ కూడా ఉంది. ఇదంతా చదివిన తర్వాత శిలాతోరణం చూడడానికి వెళ్ళాను. శిలాతోరణంని చూడగానే, ఈ శిలాతోరణం అన్ని యుగ చక్రాలను చూసి వుంటుందో కదా అని అనిపించింది. ఒక యుగం సుమారు 4 లక్షల సంవత్సరాలు అనుకున్నా, ఈ శిలాతోరణం ఎన్ని యుగాలను, ప్రళయాలను,సృష్టి మరియు అద్భుతాలను చూసి వుంటుందో! ఈ శిలాతోరణంకే గాని ఒక భాష వుండి ఉంటే, ఆ భాష మనకి కూడా అర్ధం అయితే, ఒక తాతగారి అనుభవాలను మనవడు పంచుకున్నట్లు, ఈ శిలాతోరణం వద్ద విషయాలను తెలుసుకోవడం ప్రారంబిస్తే, మన ఈ జీవిత కాలం కూడా సరిపోదేమో!